వైసీపీ పార్టీ కార్య‌క్ర‌మం ర‌ద్దు వెనుక మ‌ర్మ‌మేంటి..?

నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు..

రామ‌గోవిందురెడ్డి, ర‌ఘురామిరెడ్డిలు ఒక్క‌రే అన్న‌ది జ‌డ్పీ ఎన్నిక వ‌ర‌కు వైసీపీ అధిష్టానవర్గం అనుకుంది.. మైదుకూరు నియోజకవర్గంలో ని బి.మఠం మండలంలో ఈరోజు ( జూలై 26న ) నిర్వహించతలపెట్టిన ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ రద్దు కావడంతో ఈనేతల మధ్య అసలేమి జరిగింది.. అసలేమి జరుగుతోందన్నది రాజకీయ తెరమీదకు వచ్చింది. వైసీపీ అధిష్టానవర్గ ఆదేశ కార‌ణ‌మో? మ‌రే కార‌ణ‌మో కానీ జడ్పీ ఛైర్మన్ గా ముత్యాల రామగోవిందురెడ్డి ఎన్నికయ్యే వరకు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టివారిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి చెంత‌నే ఉన్నారు.. త‌ర్వాత కొద్దినెల‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా ఈ నేత‌లిద్ద‌రూ ( ర‌ఘురామిరెడ్డి, రామ‌గోవిందురెడ్డిలు) ప్ర‌త్య‌క్ష మ‌య్యేవారు.. ఛైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే స‌ఖ్య‌త వ‌ల్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పార్టీ బ‌ల‌ప‌డ‌తుంద‌నే ఆశాభావం ఆపార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌యింది.. ఆ ఆశ కొద్దినెల‌ల‌కే స‌డ‌లిపోయింది.. బి.మ‌ఠంలో పార్టీ కార్య‌క్ర‌మం ఏకంగా ర‌ద్దు కావ‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్క‌సారిగా నిరాశ అలుముకుంది.. ఈ నేత‌లిద్ద‌రూ ఒక్క‌రు కాదు.. వేరువేరు అన్న‌ది తేట‌తెల్ల‌మైంది.. వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లతో పాటు విభేధాలు పొడ‌చూపాయ‌న్న‌ది బ‌ట్ట‌బ‌య‌లైంది..

బి.మ‌ఠంలో ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్య‌క్ర‌మంపై పార్టీ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న జారీ..

ఈనెల 26న బ్ర‌హ్మంగారి మ‌ఠం లో ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నాం.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ‌స్తున్నారు.. నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ క్యాడ‌ర్ త‌ర‌లిరావాలి అంటూ మైదుకూరు వైసీపీ పార్టీ కార్యాల‌యంనుండి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది..

‘‘ రామగోవిందురెడ్డి, నా మధ్య మనస్పర్ధలు లేవు.. మేమిద్దరం అన్నదముల మాదిరి ఉన్నాము.. రెండు రోజుల్లో పార్టీ కార్యక్రమం బి.మఠంలో నిర్వహిస్తున్నాము.. పార్టీకి ఇద్దరం విధేలంగా ఉన్నాము.. నిన్ననే మా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రామగోవిందురెడ్డి కలిశారంటూ ’’ ఈనెల 17న మిడియాతో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నమాటలు..

‘‘ శనివారం 9 గంటలకు ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్యక్రమంను ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్య క్షులు ర‌వీంద్ర‌నాధ్‌రెడ్డి, మ‌న మాజీ ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి నిర్వహించ‌త‌ల‌పెట్టార‌ని.. క‌డ‌ప జిల్లాలో ఇంకెక్క‌డా జ‌రిగని విధంగా ఈ కార్య‌క్ర‌మంను బి.మ‌ఠంలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టామ‌ని.. పార్టీ శ్రేణులంద‌రూ త‌ర‌లిరావాలంటూ ’’ ఈనెల 5వ తేది బి.మ‌ఠంలో మండ‌ల పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల, నాయ‌కుల స‌మావేశంలో జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి పిలుపు నిచ్చారు..

‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్య‌క్ర‌మం ర‌ద్దు వెనుక అస‌లేమి జరిగింది..

ఇటీవ‌ల ర‌ఘ‌రామిరెడ్డి, రామ‌గోవిందురెడ్డిమ‌ధ్య రాజ‌కీయ విభేధాలు చోటు చేసుకున్నాయ‌నే ప్ర‌చారం జ‌రిగింది.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో వీరిద్ద‌రు క‌న‌ప‌డ‌క‌పోవ‌డం.. మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలోని మిగ‌తా మండ‌లాల్లో ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేయ‌డంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి స్వ‌యంగా వెళ్లి పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు.. ఈ స‌మావేశాల్లో ఎక్క‌డ జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి క‌న‌ప‌డ‌క‌పోవ‌డం.. బి.మ‌ఠంలో ర‌ఘురామిరెడ్డి లేకుండా వారే స‌మావేశం నిర్వ‌హించ‌డంతో వీరి మ‌ధ్య రాజ‌కీయ‌ప‌రంగా విభేధాలున్నాయ‌న్న ప్ర‌చారంకు మ‌రింత బ‌లం చేకూరింది.

బి.మ‌ఠంలో వైసీపీ పార్టీ స‌మావేశంలో ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కి మాజీ ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి వ‌స్తున్నారంటూ జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌తో నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ శ్రేణులు కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా సాగుతుంద‌ని భావించారు..
‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’’ కార్య‌క్ర‌మం జిల్లాలో ఎక్క‌డ జ‌ర‌గ‌ని విధంగా బి.మ‌ఠంలో నిర్వ‌హించి త‌న స‌త్తా చాటుకునే విధంగా ఎంపీ, పార్టీ అధ్య‌క్షుడితోపాటు, జిల్లా నాయ‌కులంద‌రూ వ‌చ్చేలా చూడ‌టంతోపాటు, తెలుగుదేశం పార్టీకి త‌మ బ‌లం చూపే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌డ్పీ ఛైర్మ‌న్ ప్ర‌ణాళిక సిద్దంచేసుకున్నారు..

దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి త‌దిత‌రుల‌ను కార్య‌క్ర‌మానికి పిలువ‌డ‌మే ర‌ద్దుకు కార‌ణ‌మా..?

‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మంకు నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నాయ‌కుల‌ను అంటే మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి విభేధిస్తున్నా వారిని సైతం జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డిని ఆహ్వానించారు.. ముఖ్యంగా ర‌ఘురామిరెడ్డికి బ‌ద్ద శ‌త్రువుగా కొన‌సాగుతున్న దుగ్గిరెడ్డి గంగాధ‌ర్‌రెడ్డితోపాటు, నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌రికొంద‌రి నాయ‌కుల‌ను ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మంకు రామ‌గోవిందురెడ్డి పిల‌చిన‌ట్లు స‌మాచారం.. గంగాధ‌ర్‌రెడ్డిని మ‌రికొంద‌రిని ఈకార్య‌క్ర‌మంకు పిలుస్తున్న స‌మాచారంను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి రామ‌గోవిందురెడ్డి తెలియ‌ప‌ర‌చ‌గా.. ఇందుకు ఎంపీ అంగీకారం తెలిపిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.. త‌మ‌ను విభేధిస్తున్న దుగ్గిరెడ్డి గంగాధ‌ర్‌రెడ్డితోపాటు, అన్న‌వ‌రం రామ‌మోహ‌న్ రెడ్డి, ఖాజీపేట‌కు చెందిన ఇంకా కొంత మంది నాయ‌కుల‌ను జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి పిల‌చిన‌ట్లు మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చెవికి చేరింది..

దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి వ‌స్తే నేను కార్య‌క్ర‌మంకు రానంటూ ‘‘ర‌ఘురామిరెడ్డి’’ అల్ట‌మేటం ఇచ్చారా..?

‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మంకు గంగాధ‌ర్ రెడ్డి , మిగ‌తా వారు వ‌స్తే నేను రాను అంటూ రామ‌గోవిందురెడ్డికి మాజీ ఎమ్మెల్యే హుకుం జారీచేసిన‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది.. ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మంకు అంద‌రినీ పిలిచాను.. వారు వ‌స్తారు అంటూ జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి ఖ‌రాఖండిగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.. బి.మ‌ఠంలో ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్య‌క్ర‌మం జ‌ర‌గాలంటే గంగాధ‌ర్ రెడ్డితోపాటు.. ర‌ఘురామిరెడ్డిని విభేధించిన వారిని రావ‌ద్దొంటూ కొందరు మ‌ధ్య వ‌ర్తులు రాజీ ప్ర‌తిపాద‌న జ‌డ్పీ ఛైర్మ‌న్ రామ‌గోవిందురెడ్డి వ‌ద్ద‌కు తీసుకురాగా.. ‘‘అలా చేయ‌ను..పార్టీలో అందరూ స‌మాన‌మే.. నేను పిలిచిన వారంద‌రూ వ‌స్తారు.. కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం చేసుకుందాము.. వారిని వద్దని అనుకుంటే నేను కార్యక్రమమే జరపను.. రద్దు చేసుకుంటా ’’ అనే సమాధానం జడ్పీ ఛైర్మన్ రామగోవిందురెడ్డి నుండి వెలువడినట్లు సమాచారం.. ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంకు పిలిచిన నాయకులందరని(మాజీ ఎమ్మెల్యే విభేధకులను) వదులుకునే ఉద్దేశం లేదని..నాకు వైసీపీ పార్టీలోని నాయకులందరూ సమానమే అనే ధోరణితో చివరకు ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమంను జడ్పీ ఛైర్మన్ రద్దు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది…. ఈ నేతలిద్దరూ వాస్తవాలను బట్టబయలు చేస్తే గానీ బి.మఠంలో జరపతలపెట్టిన ‘‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ రద్దు వెనుక మర్మం బట్టబయలవుతుంది..